Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 8:49 pm Posted by : VARTHA SANDHYA DESK

కాంగ్రెస్‌లో చేరికలకు క్రమబద్ధమైన విధానం తప్పనిసరి: డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

కాంగ్రెస్‌లో చేరికలకు క్రమబద్ధమైన విధానం తప్పనిసరి: డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

 

కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో చేరికలు అధికారిక వేదికల ద్వారానే నిర్వహించాలని, అనధికారికంగా జరిగే చేరికలకు ఎలాంటి గుర్తింపు ఉండదని ఏలే మల్లికార్జున్ స్పష్టం చేశారు.

 

జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం సభ్యత్వాలు, చేరికల ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహించాలని మండల, టౌన్ అధ్యక్షులకు ఆయన సూచనలు జారీ చేశారు. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు లేదా ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే ముందుగా సంబంధిత మండల లేదా టౌన్ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

 

అనంతరం జిల్లా అధ్యక్షుడు, గౌరవ ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్‌చార్జిల సమక్షంలో అధికారికంగా చేరికలు నిర్వహించాలని సూచించారు. పార్టీ నియమ నిబంధనలను పక్కన పెట్టి వ్యక్తిగతంగా లేదా అనధికారికంగా ఎవరైనా చేరికలు నిర్వహిస్తే, అలాంటి చేరికలకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అధికారిక గుర్తింపు ఉండదని, అవి చెల్లుబాటు కావని ఆయన హెచ్చరించారు.

 

పార్టీ క్రమశిక్షణ, సంస్థాగత వ్యవస్థను పరిరక్షించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. చేరికల విషయంలో పార్టీ నిర్ణయించిన విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

 

ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఏలే మల్లికార్జున్ తెలిపారు. జిల్లాలోని మండల, టౌన్ అధ్యక్షులు ఈ సూచనలను కచ్చితంగా అమలు చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

 

“కాంగ్రెస్ పార్టీలో చేరికలు పార్టీ అధికారిక వేదికల ద్వారానే జరగాలి. క్రమశిక్షణకు విరుద్ధంగా జరిగే చేరికలకు గుర్తింపు ఉండదు” అని డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ స్పష్టం చేశారు.