Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 8:22 pm Posted by : VARTHA SANDHYA DESK

ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్

రంగారెడ్డి జిల్లా బ్యూరో, (వార్త సంధ్య) – మార్చి 15: జనాభా లెక్కలు–2027 ప్రక్రియలో భాగంగా మొదటి దశగా చేపట్టనున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్ అధికారులకు సూచించారు.ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో చార్జ్ అధికారులు (తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు) మరియు అదనపు చార్జ్ అధికారులు (ఎంపీడీవోలు, మేనేజర్లు) కోసం నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనగణనలో భాగంగా 2026 సంవత్సరంలో మొదటి విడతగా ఇండ్ల గణన కార్యక్రమాన్ని పూర్తి డిజిటలైజేషన్ పద్ధతిలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరించి వివరాలు నమోదు చేసి ఇండ్ల జాబితాను రూపొందిస్తారని వివరించారు.

ఈ ప్రక్రియలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు గణన ప్రక్రియను నిర్వహిస్తారని, మండల పరిధిలో తహసీల్దార్లు చార్జ్ అధికారులుగా, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అదనపు చార్జ్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. అలాగే మున్సిపల్ పరిధిలో సంబంధిత మున్సిపల్ కమిషనర్లు చార్జ్ అధికారులుగా, మేనేజర్లు అదనపు చార్జ్ అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు.సెన్సస్ ఇండెక్స్ పుస్తకాన్ని పూర్తిగా చదివి అవగాహన పెంపొందించుకోవాలని, మాస్టర్ ట్రైనర్లు వివరించే ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అధికారులకు సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఇండ్ల గణన కార్యక్రమాన్ని నిర్వహించి కార్యాచరణ ప్రకారం జాబితా రూపొందించాలని తెలిపారు.

మార్చి 15, 16, 17 తేదీలలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని అధికారులు సద్వినియోగం చేసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, సీపీఓ సౌమ్య, జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.