60వ డివిజన్‌లో విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ
కార్పొరేషన్ ఎన్నికల హామీలో భాగంగా సేవా కార్యక్రమం
1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పుస్తకాల అందజేత
భద్రాద్రి జిల్లా బ్యూరో, జూలై 19 (వార్త సంధ్య) : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్‌లో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కార్పొరేటర్ భీమ శ్రీవల్లి–శ్రీధర్ మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం కార్పొరేటర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ భీమ శ్రీవల్లి మాట్లాడుతూ, “చదువే ఎవరూ దోచుకోలేని ఆస్తి. విద్యతోనే వ్యక్తి జీవితంలో వెలుగులు నిండుతాయి. నేటి విద్యార్థులే రేపటి భారత భవిష్యత్తు.

వారి విద్యాభివృద్ధికి తోడ్పడటం నా బాధ్యతగా భావిస్తున్నాను” అని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి చదువుకు ఆటంకం కలగకూడదనే సంకల్పంతో ఈ ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో మంచి స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలు, సామాజిక బాధ్యత కూడా అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు, వారి భవిష్యత్తును మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కూడా ఆ హామీల్లో భాగమేనని తెలిపారు. మిగిలిన హామీలను కూడా నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని, ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని అన్నారు. 60వ డివిజన్ సమగ్ర అభివృద్ధికి తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా ప్రతి సమస్యను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నామని తెలిపారు. మంచి పనులు జరుగుతున్న వేళ కొందరు రాజకీయ స్వార్థంతో అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే ప్రజల ఆశీర్వాదం తనకు అండగా ఉన్నంతకాలం ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గబోనని, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ప్రజలే నిజానిజాలను గుర్తించి ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసే వారిని ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. “విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల సంక్షేమం, 60వ డివిజన్ సమగ్రాభివృద్ధే నా ప్రధాన లక్ష్యం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తాను” అని కార్పొరేటర్ భీమ శ్రీవల్లి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రాజేశ్వరి, శారదా, లక్ష్మీ, భవానీ, భాగ్య ఆయాలు, వార్డు పెద్దలు, ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.